తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో మూడ్రోజుల్లో మేడారం (Medaram) సమ్మక్క (Sammakka), సారలమ్మ (Saralamma) జాతర (Jatara) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద ఈ పండగ ఘనంగా జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతర కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు కొన్ని నెలల ముందు నుంచే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుంగా.. ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలున్నాయి.
ఇక ఈ జాతర బాధ్యతలను మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు అప్పగించగా.. వారు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు కూడా ఇప్పటికే మేడారం జాతరకు క్యూ కట్టారు. అయితే జాతర ప్రారంభం వేళ మేడారం ప్రధాన పూజారి అరుణ్ కుమార్ (Arun Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు.
మేడారం మహా జాతరలో కొందరు భక్తులు అమ్మవార్లకు మొక్కి బలిచ్చే మేకలు, కోళ్లను హలాల్ చేయొద్దని సూచించారు. హలాల్ చేయడం హిందూ సంస్కృతీ, సాంప్రదాయాలకు విరుద్ధమని తెలిపారు. మేడారం వచ్చే భక్తులంతా గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను తప్పక గౌరవించాలని కోరారు.