దక్షిణ భారత కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిన మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మ (Sammakka-saralamma) దర్శనానికి గవర్నర్, కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు వీఐపీలు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు సాదారణ భక్తుల క్యూలైన్ దర్శనాలు నిలివేశారు. ఈ చర్యతో మేడారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాయకుల కోసం తమను వెళ్ళకుండా ఆపడం ఏంటని పలువురు ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో పోలీసులు క్యూ లైన్లలో ఉన్న భక్తుల పట్ల దురుసుగా వ్యవహరించడం సంచలనంగా మారింది. దీంతో కోపోద్రిక్తులైన భక్తులు పోలీసులపై తిరగబడ్డారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి సీతక్క (Sithakka)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న జర్నలిస్టులు కవరేజ్ చేయడానికి వెళ్లగా, పోలీసులు మీడియాను సైతం లెక్క చేయకుండా తోసేశారు. దీంతో మేడారంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకొన్న మంత్రి అక్కడకు చేరుకొని భక్తులను శాంతింపచేశారు. జర్నలిస్టులతో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టారు. ఇదిలా ఉండగా ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతరకు తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొంటున్నారు. ఈమేరకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ జాతరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా కూడా హాజరవుతారని మంత్రి సీతక్క తెలిపారు. ప్రముఖుల రాకకు వీలులేని మేడారంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వివరించారు. మరోవైపు వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.