తెలంగాణ (Telangana) కుంభమేళా అయిన మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ (Sammakka-Saralamma) జాతర ముగింపు దశకు వచ్చేసింది. వనదేవతలు ఇవాళ రాత్రి తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహా జాతర పరిసమాప్తమవుతుంది. ఇక చివరి రోజు కావడంతో మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. భక్తులు నిర్విరామంగా వనదేవతల్ని దర్శించుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో మేడారం జాతరకు విచ్చేసిన వాహనాలతో మేడారం-తాడ్వాయి మధ్య సుమారు 15 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపుల వాహనాలు ముందుకు కదలకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడ్వాయి అడవి ప్రాంతం అయిన పస్రా వద్ద ట్రాఫిక్ జామ్ (Traffic Jam) కావటం వల్ల సుమారు రెండు గంటలు వెయిట్ చేశామని, చిన్న పిల్లలు చీకటిలో ఇబ్బంది పడ్డారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
తినడానికి, తాగటానికి కూడా సరైన సౌకర్యాలు లేక.. ఎవరికైనా చెప్పడానికి సెల్ ఫోన్ నెట్ వర్క్ సౌకర్యం లభించక చాలా ఇబ్బంది పడ్డామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వనదేవతలను దర్శించుకొనేందుకు భక్తజనం క్యూలైన్లలో బారులు తీరుతున్నారు. పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసి పోతున్నాయి. కాగా మూడు రోజుల్లో మేడారానికి రాలేని భక్తులు.. చివరి రోజైన ఇవాళ దర్శనాలు చేసుకోవడానికి పోటెత్తుతున్నారు.
మరోవైపు ఇక్కడ కోళ్ల ధరలు కొండెక్కాయి. తొలి రెండు రోజులు కోడి కేజీ 150 రూపాయలకు విక్రయించారు. అంతలో కోళ్లు అయిపోవడం, సరఫరా తగ్గడంతో యజమానులు ధర పెంచేశారు. ఈ క్రమంలో కోడి కేజీకి 500 రూపాయలకు విక్రయించారు. భారీగా ధర ఉండటంతో చాలా మంది మేకలు, గొర్రెల మాంసం కొనుగోలు చేశారు.