ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెట్ టీమ్(Womens Cricket Team) కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (Captain Meg Lanning) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement) ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని లాన్నింగ్ వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని పేర్కొంది.
మెగ్ లాన్నింగ్ మూడు రకాల ఫార్మెట్లలో 241 మ్యాచ్‌లు ఆడి 8,352 పరుగులు సాధించింది. తన కెరీర్‌లో ప్రస్థానంలో ఏడు వరల్డ్ కప్ టైటిళ్లను సాధించడంలో కీలకపాత్ర పోషించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం అని మెగ్ లాన్నింగ్ పేర్కొన్నారు. కానీ, రిటైర్మెంట్ కోసం ఇదే సరైన టైం అనిపిస్తోందని చెప్పింది.
31 ఏళ్ల లాన్నింగ్ ఉన్నట్టుండి రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టార్ క్రికెటర్ ఆస్ట్రేలియా జట్టులో 241 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించింది. 182 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసింది. మెగ్ తన కెరీర్‌లో 17 సెంచరీలతో పాటు 38 హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు 5 వికెట్లు పడగొట్టింది. ఇక, మెగ్ లాన్నింగ్ మహిళల బిగ్‌బాష్ లీగ్ మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగుతానని ప్రకటించింది.
మెగ్ లానింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంపై ఐసీసీ స్పెషల్ ట్వీట్ చేసింది. ‘మెగ్ స్టార్.. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అంటూ ఆమె గెలిచిన ప్రపంచకప్‌తో కూడిన ఫొటోను షేర్ చేసింది. అస్ట్రేలియా తరఫున అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారిలో మెగ్ లానింగ్ మూడో స్థానంలో ఉంది. కాగా, రిటైర్మెంట్ ప్రకటిస్తూ మెగ్ లాన్నింగ్ ఎమోషనల్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.