మెగాస్టార్ (Mega Star) చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలాకాలమే అయింది. 2009 ఎన్నికల సమయంలో తగిలిన ఎదురుదెబ్బలు, తర్వాతి పరిణామాలు ఆయను పాలిటిక్స్ (Politics) కు దూరం చేశాయి. ఇప్పుడు వరుసగా సినిమాలు (Movies) చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే.. పాలిటిక్స్ పై తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ (Viral) అవుతున్నాయి. ఇవి ముమ్మాటికీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను టార్గెట్ చేస్తూనే అన్నారని ప్రచారం జరుగుతోంది.
చిరు ఏమన్నారంటే?
సంక్రాంతికి విడుదలై మెగా హిట్ సాధించిన మూవీ వాల్తేరు వీరయ్య. తాజాగా ఈమూవీ 200 రోజుల ఈవెంట్ జరిగింది. ఇందులో పాల్గొన్న చిరంజీవి.. పాలిటిక్స్ పై మాట్లాడారు. ‘‘నాయకులు రాష్ట్రాభివృద్ధి కోసం మాట్లాడాలి. ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి. పేదల కడుపు నింపాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇలా చేస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారు. అసలు విషయాలు వదిలేసి పిచుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి’’ అని ప్రశ్నించారు.
అంబటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారా?
ఈమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో కలెక్షన్లు రాబట్టింది. కానీ, ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ చిత్రంలో శ్యాంబాబు అనే పాత్రను తనను ఉద్దేశించే పెట్టారని.. పవన్ ది శాడిజం అంటూ నానా తిట్లు తిట్టారు. మరోసారి పవన్ పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చి తాను కూడా త్వరలో సినిమా తీస్తానని కొన్ని టైటిల్స్ ను ప్రెస్ మీట్ లో చెప్పారు. దీనికి జనసేన వర్గాల నుంచి గట్టిగానే కౌంటర్స్ వస్తున్నాయి. తాజాగా, చిరు చేసిన వ్యాఖ్యలు అంబటిని ఉద్దేశించే చేశారనే టాక్ వినిపిస్తోంది.
జగన్ కు దగ్గరగా.. దూరంగా..!
కొన్నాళ్ల క్రితం సినిమా టికెట్ల అంశం సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. ఏపీ సర్కార్ పెట్టిన కెండిషన్స్ కు సినీ ప్రముఖులు షాకయ్యారు. విడతల వారీగా అనేక చర్చలు జరిగాయి. బడా హీరోలందరూ తాడేపల్లికి క్యూ కట్టారు. జగన్ (Jagan) తో ఉన్న సఖ్యత కారణంగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ముందుడి అంతా సెట్ రైట్ చేశారు. కానీ, ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోందని ఆరోపణలు వినిపించాయి. వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని ఖండించాయి. జగన్ తో చిరు దగ్గరగా ఉంటుండడంపై అనేక అనుమానాలు కూడా తెరపైకి వచ్చాయి. ఆయన వైసీపీ తరఫున రాజ్యసభకు వెళ్తున్నారని ప్రచారం సాగింది. అయితే.. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఏపీ సర్కార్ కు చురకలంటిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తన మద్దతు ముమ్మాటికీ పవన్ కే ఉంటుందని పరోక్షంగా చిరు చెప్పేశారని అంటున్నారు విశ్లేషకులు.