ప్రధాని మోడీ (PM Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pavan Khera) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రధాని మోడీ ఒక సర్టిఫైడ్ లయర్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని నోటి వెంట అసత్యాలు తప్ప నిజాలు రావని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ ర్యాలీలో 40 సార్లు కాంగ్రెస్ పేరు ఎత్తడంపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.
మధ్య ప్రదేశ్ లో 51 నిమిషాల ప్రసంగంలో 44 సార్లు కాంగ్రెస్ పేరును మోడీ ప్రస్తావించారన్నారు. రాష్ట్రంలో 18 ఏండ్ల పాలన గురించి చెప్పకుండ కేవలం కాంగ్రెస్ గురించి ప్రస్తావన తెచ్చారంటే బహుశా రాష్ట్రంలో బీజేపీ సాధించనదేమీ లేదని ఎద్దేవా చేశారు. ఏఐడీఎంకే మాదిరిగానే భవిష్యత్ లో మరిన్ని పార్టీలు ఎన్డీఏకు దూరమవుతాయన్నారు.
రాజీవ్ గాంధీ హయాంలో 1989లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్య సభ ముందుకు వచ్చిందన్నారు. ఆ సమయంలో కాషాయ పార్టీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదన్నారు. అప్పుడు మహిళా బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించిందని, కానీ రాజ్య సభలో దాన్ని బీజేపీ అడ్డుకున్నదని ఆయన ఆరోపించారు.
ప్రధాని ఏ రాష్ట్ర పర్యటనకు వెళ్లినా అక్కడ కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అందుకే ఆయన్ని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా తాము భావిస్తున్నామని చెప్పారు. ఇటీవల మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ మరో ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోడీ పెద్ద అబద్దాల కోరు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.