సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో, ఫార్మాసిటీని (Pharma City) రద్దు చేయడం లేదని వెల్లడించారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో మార్గం దూరాన్ని తగ్గిస్తామన్నారు.
అవసరం అనుకుంటే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకు వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తామని అన్నారు. కొత్తగా ప్రతిపాదించే లైన్లను తక్కువ ఖర్చులో పూర్తి చేస్తామని వివరించారు.
ఫార్మా సిటీ, ఆర్ఆర్ఆర్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు గృహ నిర్మాణం కూడా ఉంటుందన్నారు. ఈ నెల 3 నుంచి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడటంతో పలు ప్రభుత్వరంగ సంస్థలకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.
పార్టీ కోసం పనిచేసినవారికే నామినేటెడ్ పదవుల విషయంలో ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు. సన్నిహితులు, బంధువులు అనే ప్రాతిపదికన పదవుల కేటాయింపు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ ను నియమించిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.