ఉత్తర మెక్సికో(Mexico)లో మరోసారి కాల్పుల మోత(Shooting) కలకలం సృష్టించింది. ఓ పార్టీపై ముగ్గురు ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 26 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
సరిహద్దు రాష్ట్రమైన సోనోరాలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం గందరగోళం నెలకొంది. సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు ముష్కరులు కలిసి ఒక ఈవెంట్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.
ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన అనంతరం దుండగులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
అయితే పోలీసుల కాల్పుల్లో దుండగులు హతమయ్యారని అధికారులు తెలిపారు. మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో గ్వానాజువాటో ఒకటి.. ఇక్కడ ప్రతిరోజూ కాల్పుల ఘటనలు తరచూ జరుగుతుంటాయి. 12రోజుల కిందట ప్రీ క్రిస్మస్ పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 12 మంది మృతిచెందారు.