రాష్ట్రంలో ఆరోగ్య శాఖపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.. గత ప్రభత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో ఆర్భాటం చేసింది తప్పితే అనుకొన్నంత ఫలితాలు రాబట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి.. ఎక్కడో ఒక్క చోట అరకొరగా రోగులకి వసతులు కలిపించి.. దాన్ని పదవిలో ఉన్నంత కాలం బీఆర్ఎస్ (BRS) ప్రచారం చేసుకొందనే వాదనలు ఉన్నాయి.. ఇక హనుమకొండ (Hanumakonda) ఎంజీఎం ఆసుపత్రి విషయానికి వస్తే..
శుక్రవారం అర్ధ రాత్రి సమయంలో హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రిలో కోతులు హాల్ చల్ చేశాయి.. ఆసుపత్రి అత్యవసర వైద్యవిభాగం వెనుకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్తు స్తంభాల తీగలను కదిలించడంతో.. షార్ట్ సర్క్యూట్ జరిగి ట్రాన్స్ఫార్మర్ పేలింది. కరెంటు తీగలు ఒకదానికొకటి తగలడంతో మంటలు వచ్చి విద్యుత్తు సరఫరా నిలిచి పోయింది. దీంతో ఆసుపత్రి మొత్తం అంధకారంతో నిండిపోయింది.
అత్యవసర రోగులకు చికిత్స అందించడానికి వైద్యులకు సైతం అవస్థలు తప్పలేదు. నవజాతశిశు సంరక్షణ కేంద్రంలో చికిత్స పొందుతున్న శిశు వులకు ఆక్సిజన్ అందుతుందో లేదో తెలియక తల్లిదండ్రులు వార్డు బయట ఆందోళన చెందారు. మరోవైపు ఉత్తర తెలంగాణ (Telangana)కు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రి (MGM Hospital)లో ఆక్సిజన్ వెంటిలేటర్లు, నవజాతశిశు సంరక్షణ కేంద్రంలోని ఇంక్యుబేటర్లకు విద్యుత్తు సరఫరా లేనప్పుడు కనీసం బ్యాటరీ బ్యాకప్ ఉండాలి.
ఆత్యవసర సమయంలో విద్యుత్తును అందించడానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్లు ఉన్నా ఆవి పనిచేయడం లేదని సమాచారం. ఇలాంటి లోపాలు ఆస్పత్రి నిర్వహణలో ఉన్న నిర్లక్ష్యానికి సాక్ష్యాలు.. ఇదిలా ఉండగా.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన విషయం తెలుసుకొన్న ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాలతో ఆర్ఎంవో డాక్టర్ మురళి, ఇతర వైద్యాధికారులు ఆసుపత్రికి చేరుకొన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులను పిలిపించి మరమ్మ తులు చేపట్టినట్టు తెలిపారు..
ఇక ఎంజీఎం ఆసుపత్రిలో వసతుల కొరత ఎంతో కాలం నుంచి వేధిస్తున్న సమస్య.. ప్రభుత్వాలు మారుతోన్నప్పుడల్లా పాలకులు మాటలు చెప్పడం.. ఆ తర్వాత వాటిని మరచిపోవడం సర్వసాధారణంగా మారిపోయిందని అంటున్నారు.. బీఆర్ఎస్ ప్రభత్వంలో బాగుపడలేదనే ఆరోపణలు ఉన్న ఎంజీఎం.. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బాగు చేస్తుందా? అని అనుకొంటున్నారు..