పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుపాను (Michaung Cyclone) తీవ్రరూపం దాల్చి సముద్ర తీరానికి అతిచేరువలో కేవలం 20కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏపీ తీరం వెంబడి నెల్లూరు నుంచి ఓడరేవు వైపు కదులుతున్న మిచాంగ్ తుపాను మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. ఇది బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు వెల్లడించారు.
మిచాంగ్ తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణకూ ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం షురూ అయింది. ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్పల్లి, కొండాపూర్, బీఎన్‌రెడ్డి, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, బోయిన్పల్లి, బేగంపేట్, బాలానగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, చాంద్రాయణగుట్ట, హిమాయత్‌నగర్, అంబర్‌పేట, మల్కాజిగిరిలో వర్షం కురుస్తోంది.
ఏపీలో కోస్తాంధ్ర తీరప్రాంతం ఆనుకుని నెల్లూరు నుంచి బందరు వైపు సాగుతున్న తుపాను మరికొద్ది సేపట్లో(మంగళవారం ఉదయం) తీరం దాటే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల-దివిసీమ మధ్య తీరం దాటుతుందని అధికారులు పేర్కొన్నారు. తుఫాను కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ మధ్య రైల్వే దాదాపు 150 రైళ్లను రద్దు చేసింది.
ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి- సూర్యాపేట, నాగర్‌కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జనగామ, యాదాద్రి-భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.