మిచాంగ్ తుపాను(Michaung Cyclone) ప్రభావం చెన్నై, ఏపీతో పాటు తెలంగాణపైనా పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుపాను ప్రభావంతో ఉత్తర తెలంగాణ(North Telangana)లోని జిల్లాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణపై ప్రభావం అధికంగా ఉందని, దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఇవాళ ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, జనగామ, భూపాలపల్లి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
హైదరాబాద్‌లో ఓ మోస్తారు వర్షం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, బహదూర్‌పల్లి, సూరారంలో భారీ వర్షం కురుస్తోంది. అదేవిధంగా సూర్యాపేట, యాదగిరిగుట్ట, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.