భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభానికి ముందు కాంగ్రెస్ (Congress)కు భారీ షాక్ తగిలింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మిలింద్ దేవరా (Milind Deora) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు తన రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయానికి ముగింపు పలికినట్టు చెప్పారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేసినట్టు తన ఎక్స్ ఖాతా(ట్విట్టర్)లో తెలిపారు. పార్టీతో తన కుటుంబానికి ఉన్న 55 ఏండ్ల బంధం నేటితో ముగిసి పోయిందని వెల్లడించారు. చాలా ఏండ్లుగా పార్టీలో తనకు సహకారం అందించిన నేతలు, కార్యకర్తలు, సహచరులకు ధన్యవాదాలు తెలిపారు.
తాను అభివృద్ధి పథంలో నడవబోతున్నట్టు పేర్కొన్నారు. అనంతరం ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో మిలింద్ దేవరా పూజలు చేశారు. 2014 వరకు మిళింద్ దేవరా ముంబై దక్షిణ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. కానీ ఇటీవల ఆ స్థానంపై సందిగ్ధత నెలకొంది.
రాబోయే ఎన్నికల్లో ముంబై దక్షిణ ఎంపీ స్థానం నుంచి తమ పార్టీ పోటీ చేయబోతున్నట్టు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వెల్లడించింది. ఇండియా కూటమిలో సీట్లు సర్దుబాటులో భాగంగా ఆ స్థానాన్ని శివసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణ ముంబై నుంచి పోటీ చేసే అవకాశం తనకు లభించకపోవచ్చని భావించిన మిలింద్ దేవరా ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.