రాజకీయాలపై బండ్ల గణేష్(Bandla Ganesh)కు ఉన్న కమిట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు లేదని మంత్రి అమర్నాథ్(Minister Amarnath) విమర్శించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ కాంటాక్ట్ కోసం పుట్టిన పార్టీ జనసేన అంటూ విమర్శలు గుప్పించారు.
విశాఖ ఉక్కు ప్రయివేటీకారణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి అమర్నాథ్ కొట్టిపారేశారు. స్టీల్ ప్లాంట్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైనా చెప్పిందా? అంటూ ప్రశ్నించారు. బలహీనతలు బయటపడ్డ తర్వాత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
ఉత్తారంధ్ర అభివృద్ధిని టీడీపీ, జనసేన అడ్డుకుంటున్నాయని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. పవన్, చంద్రబాబుకు వంద రోజుల సమయం మాత్రమే ఉందని, ఒకే దెబ్బకు రెండు పిట్టలు రాలిపోతాయని సెటైర్లు విసిరారు. 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయన్నారు. వారం రోజుల్లో ఉద్దానంలో ఆసుపత్రిని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖ ఐటీ హిల్స్‌లో యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ రాబోతోందని, ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ ఫలితాల తర్వాత జనసేనకు తగిలిన దెబ్బకు మతి చలించినట్లు కనిపిస్తోందంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. స్థాయిని మరిచి అబ్రహం లింకన్ గురించి కాదు చంద్రబాబుతో ఉన్న లింకులు గురించి పవన్ మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఓట్లను సాధించడంతో బర్రెలక్కతో జనసేన పోటీపడిందని, డిపాజిట్లు కూడా రాలేదని అమర్నాథ్ చురకలంటించారు.
తెలంగాణలో స్థిర నివాసమున్న పవన్ బలం ఏంటో ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ది ఏ నియోజకవర్గమో చెప్పాలి అంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో తెలియని నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి పవన్.. నాయకుడుగా కాదు కథానాయకుడుగా ఎక్కడ పోటీ చేస్తారో చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీని నాశనం చేశాడని, ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుందో చూద్దామన్నారు.