తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది డబుల్ బెడ్రూం ఇళ్లు. పేదలు కూడా పెద్ద ఇంట్లో ఉండాలనే లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చారు. కానీ, జిల్లాల్లో ఈ పథకం విషయంలో అనేక విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. అసలు లబ్ధిదారులకు కాకుండా.. బీఆర్ఎస్ (BRS) నేతలు తమ అనుచరులకు ఇళ్లు ఇప్పిస్తున్నారని.. కొందరు కమీషన్లు దండుకుంటున్నారని.. ఇలా ఏదో ఒక ఇష్యూతో డబుల్ బెడ్రూం పథకంపై చర్చ సాగుతుంటుంది. తాజాగా మరో వివాదంతో మార్మోగుతోంది.
డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంతకం ఫోర్జరీ చేశారు కేటుగాళ్లు. మంత్రి పేరుతో నకిలీ లెటర్ హెడ్ ను తయారు చేసి.. దొంగ సంతకాలతో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టర్ కు సిఫార్సులు పంపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్సు లేఖలు రాలేదని, అధికారులు మంత్రి కార్యాలయం దృష్టికి దీన్ని తీసుకువెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది.
సిఫార్సు లేఖలపై ఆరా తీయగా.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ గౌస్ పాషా, గుంటి శేఖర్ వీటిని తయారు చేసినట్లు బయటపడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంత్రి ఓఎస్డీ ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు (Police). నిందితులు పాషా, శేఖర్ పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు పెట్టి దర్యాప్తు చేపట్టారు.