ఎన్నికల ప్రచారంలో నేతలు ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవడంతోనే సరిపోతుందని.. ఇన్నాళ్లుగా గుర్తుకు రాని విషయాలన్ని ఇప్పుడే గుర్తుకు వచ్చినట్టు చెబుతున్నారని జనం అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ప్రతిపక్షాలను చీల్చి చెండాడితేనే ఓట్లు రాబట్టు కోవచ్చు అనే ఫార్మాట్ లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు భావిస్తున్నట్టు ముచ్చటించుకుంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ (Congress)కు దమ్కిలిస్తూ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులు ప్రచారాలు చేసుకోవడం జనాల్లో ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో జనగామ (Jnagam) జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి (Errabelli) కాంగ్రెస్ పై కీలక విమర్శలు చేశారు. పాలకుర్తి సభలో ప్రజలను తన్నిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆరోపించిన ఎర్రబెల్లి.. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి BRS పార్టీని ఆశీర్వదించాలని తెలిపారు.
కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాలలో సరిగ్గా కరెంటు కూడా ఇవ్వని కాంగ్రెస్ గురించి.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) బ్రోకర్ మాటలు చెబుతున్నాడాని ఎర్రబెల్లి విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. పాలకుర్తి లో ఎగిరిది బీఆర్ఎస్ జెండానే అని దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం, కంబాలకుంట తండాను ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించిన ఎర్రబెల్లి దయాకర్.. కేసీఆర్ రాకముందు తండా పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలని అక్కడి ప్రజలను కోరారు.
తాగునీరు లేక, విష జ్వరాలతో బాధపడుతున్న తండా ప్రజలను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టించుకోలేదని ఎర్రబెల్లి ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ హామీ మేరకు తండాలను పంచాయతీలుగా మార్చి లంబాడీలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే గిరిజనులతో పాటు రేషన్ కార్డులు ఉన్న వారికి రూ.400లకే సన్న బియ్యం, సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వరంగల్ జిల్లా మాజీ ఎంపీపీ కంజర ఐలయ్య రాయపర్తితో పాటు మరికొందరు ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.