తెలంగాణ (Telangana) లో ఎన్నికల యుద్ధం మొదలైంది. ఎలక్షన్లకు సమయం సమీపిస్తూ ఉండటంతో బీఆర్ఎస్ (BRS) నేతలు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ కు మైలేజీ పెంచాలని పడే తాపత్రయంలో ఏమని విమర్శిస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ (BJP) పై ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా తెలిసిందే.
ఇప్పటికే విమర్శలు చేయడంలో పట్టా పుచ్చుకొన్నట్టు ప్రవర్తించే మంత్రి గంగుల మరోసారి కాంగ్రెస్, బీజేపీ పై విమర్శలు చేశారు. ఆంధ్రా వాళ్ళు కాంగ్రెస్ ముసుగుతో వచ్చి తెలంగాణను, ఆంధ్రాతో కలపాలని చూస్తున్నారని కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారం ఢిల్లీ చేతిలో కాదని, కేసీఆర్ చేతిలో పెట్టాలని కోరారు. కాంగ్రెస్ బీఫామ్ లు బీజేపీ ఆఫీసులో తయారవుతాయంటూ సెటైర్లు వేశారు మంత్రి గంగుల.
కేసీఆర్ లేని తెలంగాణ అంటే నెర్రలు వారిన తెలంగాణ అన్నారు. గత ఎన్నికల్లో కూడా సర్వేలన్నీ కాంగ్రెస్ కి అనుకూలమని చెప్పాయి.. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న సర్వేలన్నీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చి విఫలమైన కాంగ్రెస్.. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక పోతోందని ఎమ్మెల్యే గంగుల అన్నారు.