బీజేపీ (BJP) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కోసం తెలంగాణ (Telangana) కు వచ్చిన ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రూ.80.50 కోట్లతో హాజీపూర్ లో చేపడుతున్న పడ్తాన్ పల్లి ఎత్తిపోతల పథకం, దొనబండలో విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ మాయమాటలు చెబుతోందని… ఆ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతోందని.. వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనన్నారు. ‘‘కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం. కాంగ్రెసోళ్లు అంటే నయవంచన.. నాటకం. ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారు. కొట్లాడుకునే సంస్కృతి వారిది. ఒక్క మాటలో కాంగ్రెస్ సంస్కృతి చెప్పాలంటే.. మాటలు, మూటలు, ముఠాలు, మంటలు’’ అంటూ ఫైరయ్యారు.
కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ ఆటలు సాగవన్న హరీష్… కేసీఆర్ హయాంలో కరువు లేదని వివరించారు. ఇక బీజేపీ నేతలు నడ్డా, బీఎల్ సంతోష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోనే బీజేపీని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో ఏం చేస్తారని ఏద్దేవ చేశారు. ‘‘తెలంగాణలో బీజేపీ డకౌటే. ఆ పార్టీ పోయినసారి ఒక్కటి గెలిచింది.. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా రాదు గాక రాదు. ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నారు కదా.. డిపాజిట్లు దక్కించుకునే ఓ కమిటీ వేసుకోండి’’ అంటూ సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో హంగ్ వస్తదని బీఎల్ సంతోష్ అంటున్నారని.. హంగ్ కాదు హ్యాట్రిక్ కొడతామని తెలిపారు. బీఎల్ సంతోష్ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. గుజరాత్ లో మీరు మూడు నాలుగు సార్లు గెలవొచ్చు.. కానీ కేసీఆర్ తెలంగాణలో మూడు నాలుగు సార్లు గెలవొద్దా? మీ గుజరాత్ కంటే మా తెలంగాణ పాలన నూరుపాళ్లు నయం అంటూ మండిపడ్డారు హరీష్ రావు.