తెలంగాణ (Telangana) ఎన్నికల సందర్భంగా బీజేపీ (BJP) అగ్ర నేతలు రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పర్యటించి కేసీఆర్ (KCR) పై విరుచుకుపడ్డారు. అవినీతి సర్కార్ ను తరిమేద్దామని పిలుపునిచ్చారు. అయితే.. మోటార్లకు మీటర్ల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు అస్త్రంగా మారింది.
మోటార్లకు మీటర్ల విషయంలో చాలాకాలంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య యుద్ధం జరుగుతోంది. కావాలనే బీజేపీ సర్కార్ నిధులను ఆపేసిందని కేసీఆర్ విమర్శలు చేస్తుండగా.. అసలు, మోటార్లకు మీటర్లు అనేది లేదని బీజేపీ నేతలు వాదిస్తూ వస్తున్నారు. అయితే.. మోటార్లకు మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు అదనపు రుణానికి అనుమతి ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదనపు రుణం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలని చెప్పుకొచ్చారు. నిబంధనలు పాటించకుండా అదనంగా అప్పు ఇవ్వడం ఎలా వీలవుతుందన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ అలా కాదని.. చెప్పిన వెంటనే మోటర్లు బిగించాయని.. అందుకే వాటికి అదనపు రుణాలు ఇచ్చామని వెల్లడించారు.
కేంద్రమంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించారు. నిర్మల వ్యాఖ్యలతో నిజమేదో అబద్ధమేదో తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మోటార్లకు మీటర్లు పెడుతున్నాయని చెప్పి ఆమె పుణ్యం కట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని.. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని అన్నారు. పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పారు.
తెలంగాణలో 24 గంటల నాణ్యమైన కరెంట్ కావాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు హరీష్ రావు. రైతుల పాలిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శత్రువులని విమర్శించారు. రైతులకు మంచి జరగాలని యూపీఏ హయాంలో స్వామినాథన్ ఒక నివేదిక సమర్పించారని.. ఇప్పటికీ ఆ నివేదికను కాంగ్రెస్, బీజేపీలు అమలు చేయలేదని మండిపడ్డారు. మోటార్లకు మీటర్ల విషయమై కేంద్రం నుంచి వచ్చే రూ.25 వేల కోట్ల నిధులు ముఖ్యమా.. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు కేసీఆర్ అన్నదాతల పక్షానే నిలిచారని తెలిపారు హరీష్ రావు.