గృహ నిర్మాణల భూ సేకరణలో అవినీతి జరిగినట్లు ప్రధానికి జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) లేఖ రాయడంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు కొట్టేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టిందని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేయమని తామూ ప్రధానికి లేఖ రాస్తామని వెల్లడించారు.
తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. అసలు పవన్‌కల్యాణ్‌కు ఏపీలో డోర్ నెంబర్ ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. కనీసం ఆయనకు ఏపీలో ఓటు ఉందా? లేదా ఆధార్ కార్డ్ ఉందా? చంద్రబాబు ఇచ్చే డబ్బుల కోసం ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధంగా ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందు లోకేష్ దోచుకున్న డబ్బుల మీద లేఖ రాయండని చురకలంటించారు.
30లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్ళ నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. మనీ లాండరింగ్ ఎలా జరిగిందో విచారణ జరిపించాలని కోరతామని, ఆ ప్రభుత్వంలో పవన్ కూడా భాగస్వామేనని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తిన 13 అంశాలకు సమాధానాలను మీడియా ద్వారా అందజేస్తామని తెలిపారు.
చంద్రబాబు స్కిల్ స్కాంపై విచారణ చేయమని కేంద్రాన్ని ఎందుకు కోరలేదని, పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామన్న చంద్రబాబును ఎందుకివ్వలేదని అడిగారా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబుతో పవన్ భాగస్వామి కాలేదా? అంటూ మండిపడ్డారు. పేదలకు భూములు, ఇళ్లు నిర్మించి ఇస్తుంటే మీకెందుకు కడుపుమంట? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.