రాష్ట్ర నీటి వాటాలను గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం వదలి పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఆరోపించారు. కేంద్రానికి గతంలో బీఆర్ఎస్ తలొగ్గిందని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. నాటకాలాడటంలో కేసీఆర్ దిట్ట అని మండిపడ్డారు.
ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే జల వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం ఆదరాబాదరాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ పర్మిషన్లు తెచ్చుకున్నారని ఆరోపించారు. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ ఇద్దరూ కలిసి ఈ కొత్త నాటకానికి తెరలేపారని నిప్పులు చెరిగారు.
కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితిలోనూ అప్పగించబోమన్నారు. అసలు ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసినా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తన పదేళ్ల పాలన కాలంలో పాలమూరు – రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు? అని ప్రశ్నించారు. రాయలసీమలో ప్రాజెక్టు కట్టేందుకు జగన్కు కేసీఆర్ సహకరించారని ఆరోపణలు గుప్పించారు.
అనంతరం ఏఐసీసీ నేత వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ…. నీళ్లు, నిధులు, నియామకాలు పేరిట కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. నిందమోపడం, అవినీతిని, అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.