Telugu News » Shiva Bala Krishna : అక్రమార్కుడు… వెయ్యి కోట్లకు పైనే ఆస్తులు..!

Shiva Bala Krishna : అక్రమార్కుడు… వెయ్యి కోట్లకు పైనే ఆస్తులు..!

ఇప్పటి వరకు ఆయన అక్రమ ఆస్తులు రూ. 250 కోట్లుగా అధికారులు గుర్తించారు.

by Ramu
telangana acb finds 214 acres land of hmda former director shiva balakrishna

– హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమార్జన
– బినామీల పేర్లతో 214 ఎకరాలు
– తెలంగాణతోపాటు విశాఖలో 29 ప్లాట్లు
– 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు
– విచారణలో గుర్తించిన ఏసీబీ అధికారులు
– తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి బాగోతాలు
– కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు
– మరో 14 రోజుల కస్టడీ పొడిగింపు

అవినీతి అనకొండ, అవినీతి తిమింగలం ఈ పదాలేవీ హెచ్ఎండీఏ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ (Shiva Bala Krishna) కు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇతగాడి అక్రమాస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు విచారించారు. కస్టడీ ముగియడంతో బుధవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

telangana acb finds 214 acres land of hmda former director shiva balakrishna

కేసుకు సంబంధించిన వివరాలను కోర్టులో సబ్మిట్ చేయగా.. శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో శివ బాలకృష్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు. అంతకు ముందు శివ బాలకృష్ణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే.. శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలపై ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర సంచలన ప్రకటన చేశారు.

ఇప్పటి వరకు మొత్తం రూ.250 కోట్ల అక్రమాస్తులు గుర్తించామన్నారు. అలాగే, ఆయనకు సంబంధించి 214 ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. బినామీల పేరుతో ఇవి ఉన్నాయి. జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌ కర్నూల్‌ లో జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించారు. ఆస్తులన్నీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు.

శివ బాలకృష్ణకు తెలంగాణతో పాటు వైజాగ్ లోనూ ప్లాట్స్ ఉన్నాయని తెలిపారు సుధీంద్ర. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ఫ్లాట్స్, 3 విల్లాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్నారు. అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. హెచ్ఎండీఏలో కీలక ఫైల్స్‌ ను స్వాధీనం చేసుకున్నామని.. లాకర్స్ లోనూ భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని చెప్పారు. రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులపై వెరిఫై చేస్తున్నామని సుధీంద్ర తెలిపారు.

ఈ కేసులో ఫినిక్స్, ఆదిత్య సంస్థలకు సంబంధించిన ప్రతినిధులను విచారించింది ఏసీబీ. ఈ సంస్థలు శివ బాలకృష్ణకు భారీగా ముడుపులు అప్పజెప్పినట్టు గుర్తించారు అధికారులు. ఇతని అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని భావిస్తున్నారు. దర్యాప్తులో కీలక అంశాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు రిమాండ్‌ ను పొడిగించాలని కోర్టును కోరారు.

You may also like

Leave a Comment