ప్రపంచానికి వ్యాక్సిన్ (Vaccine) రాజధానిగా హైదరాబాద్ (Hyderabad) మారిందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు (Results) సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దేశంలోనే అత్యధిక మానవ వనరులు వున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా అనుకూలతలు రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ సర్కార్ పనిచేస్తోందనటం నిర్వివాద అంశమన్నారు.
భారత్ సీరం సంస్థకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందన్నారు. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఫేజ్-3లో ఉన్నామని పేర్కొన్నారు. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు. తమకు, కేంద్రానికి పడదన్నారు. తెల్లారిలేస్తే తాము, వాళ్లూ తిట్టుకుంటామని, విమర్శలు చేసుకుంటామన్నారు. రెండు పార్టీల మధ్య ఎప్పుడు ఏదో ఒక పంచాయితీ ఉంటుందన్నారు.
కానీ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా వుందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నంబర్ వన్ ఎవరని అడిగితే ఖచ్చితంగా తెలంగాణ అని వాళ్లు చెప్పుకునే స్థాయికి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తీసుకు వచ్చారన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు.