తెలంగాణ(Telangana) లో బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆరోపించారు. కరీంనగర్లోని ఇందిరా భవన్లో పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.తెలంగాణకు బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేశాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా ఇచ్చిందా? అని నిలదీశారు. పదేళ్లలో ఎవరి అకౌంట్లలో పది లక్షలు వేశారో చెప్పాలన్నారు.
బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ అమరవీరులను అవమానించిందని మంత్రి పొన్నం మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం జరగాలంటే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.
నల్లచట్టాలు తీసుకొచ్చింది, ఢిల్లీలో నిరసన తెలుపిన రైతులపై అమానుషంగా ప్రవర్తించిందన్నారు. మతపరంగా రెచ్చగొట్టడం తప్ప బీజేపీ చేసిందేమీలేదని మంత్రి పొన్నం ఆరోపించారు. రాముడి పేరుపై బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారికి చరమగీతం పాడాలన్నారు. పార్లమెంటు సాక్షిగా విభజన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
వరిధాన్యం కొనాలంటే కేంద్రం, బీఆర్ఎస్లు దోబూచులాడాయని గుర్తుచేశారు. తల్లి గురించి మాట్లాడిన వ్యక్తి సమాధి కావల్సిందేని, గత ఎన్నికల్లో హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న బీఆర్ఎస్ను ప్రజలు బొందపెట్టారని విమర్శించారు. తల్లి గురించి మాట్లాడే వ్యక్తి ఒక అమ్మకి పుట్టలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పుడు జరిగిన అభివృద్ధికి చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని గుర్తుచేశారు. బండిసంజయ్ అవినీతిపరుడు కాబట్టే అధ్యక్ష పదవినుండి తొలగించారని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేది కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.