హుస్నాబాద్ (Husnabad)ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గానికి హుస్నాబాద్ దిక్సూచిగా మార్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హుస్నాబాద్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్లినా ఈ ప్రాంత ప్రజలు తల ఎత్తుకుని తిరిగేలా మీ ఎమ్మెల్యే గా పాటు పడతానని హామీ ఇచ్చారు.హుస్నాబాద్‌లో ఉన్నన్ని రోజులు వార్డుల్లో సమస్యలు తెలుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
హుస్నాబాద్‌లో కేంద్ర విద్యా లయం కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను కలవవచ్చునన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మున్సిపల్ సమావేశాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయం ఉంటుందన్నారు. ఆ తర్వాత అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ జరుగుతోందన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. గౌరవెల్లి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. త్వరలో ప్రజలందరి సమక్ష్యంలో ప్రారంభించుకుందామన్నారు.