అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) అనేక హామీలు ఇచ్చింది. వాటిని ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). 420 హామీలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ విమర్శలపై హస్తం సైడ్ నుంచి కౌంటర్లు కూడా వెంటనే వస్తున్నాయి. తాజాగా మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు. వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయంలో గురువారం ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కేటీఆర్ కు మైండ్ పని చేయడం లేదని విమర్శించారు సీతక్క. విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. అధికారం లేకుండా ఎమ్మెల్యేగా ఉండలేకపోతున్నారని దుయ్యబట్టారు. ‘మీ అహంకారమే మీ ఓటమికి కారణం’ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ప్రమాణ స్వీకారం చేయడం లేదన్నారు. కుళ్ళు రాజకీయాలు ఎందుకని.. తమపై మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని మండిపడ్డారు.
తాము సక్రమంగా పని చేస్తేనే ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారని.. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చెయ్యాలన్నారు సీతక్క. ఇటు సర్పంచ్ ఎన్నికలపైనా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచుల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదన్నారు. ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ నెలతో పాలక వర్గాల కాలపరిమితి ముగియనుంది. దీంతో ప్రత్యేకాధికారులతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నందున వాటిపై ఫోకస్ పెట్టింది.
రాజన్న తమ ఇలవేల్పు.. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటామన్నారు సీతక్క. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ అని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకి గురి అయిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు.