పదేళ్లుగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు ఎట్టకేలకు అధికారం చేజిక్కడంతో ‘ప్రజా పాలన’ దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్పై విమర్శలు చేయడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలడంలేదు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతల విమర్శలకు సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీటుగా జవాబిస్తున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై మంత్రి సీతక్క(Minister Seethakka) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మరో సారి అధికారంలోకి వస్తే కవిత సీఎం(CM) కావాలని భావించారని, అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో కవిత ఆశలు గల్లంతయ్యాయన్నారు.
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ సర్కారుపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందన్నారు. మహిళలను కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కవిత ప్రయత్నాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
జీవో నంబరు 3కి వ్యతిరేకంగా కవిత మాట్లాడుతున్నారని, అసలు జీవో నెంబరు 3 ఇచ్చిందే కేసీఆర్ సర్కార్ అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నిర్మాణాత్మక విపక్షంగా పని చేయాలని హితవు పలికారు.