కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శల దాడి చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ (KCR) హాస్పిటల్ లో ఉండడంతో ఆయన తనయుడు కేటీఆర్ (KTR) కూడా అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ తానై పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు హరీష్ రావు. ఈ క్రమంలోనే కొత్త సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే.. కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. హస్తం ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.
సాధ్యం కానీ హమీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క (Seethakka) స్పందించారు. బీఆర్ఎస్ (BRS) నేతలకు అంత తొందర పాటు ఎందుకని మండిపడ్డారు. అధికారం పోయిందన్న బాధ కేటీఆర్ ను వెంటాడుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో తాము ఇచ్చిన హామీలకు.. బీఆర్ఎస్ జోడించి చెప్పిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ పార్టీ వాళ్లు ఎలా ప్రశ్నిస్తున్నారని అడిగారు. ఒక్కో హామీని అమలు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ను గెలిపించినందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు సీతక్క.
కేటీఆర్ ఏమన్నారంటే..?
తాము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు కేటీఆర్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు ఇచ్చారని చెప్తారని అన్నారు. ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయని.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాంధీ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్దత తెస్తామన్న హామీ ఎక్కడ? అని ప్రశ్నించారు కేటీఆర్.