దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ (Vision) అని తెలిపారు. మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్ది చూపిస్తామని వెల్లడించారు. ప్రతి రాష్ట్రం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపబోమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. రాష్ట్రంలో గత మూడేండ్లుగా స్థిరాస్తి రంగం బాగా పుంజుకుందని చెప్పారు. సుస్థిరమైన విధానంలో స్థిరాస్తి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
‘పారిశ్రామిక వేత్తలకు మా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరం. రష్యా లాంటి దేశాల్లో పారిశ్రామిక వేత్తలు కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. చేసే పనిలో డిజైన్, నాణ్యత, స్థిరత్వం విషయంలో పారిశ్రామిక వేత్తలు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మన పారిశ్రామిక విధానంలో ప్రతిబింబిస్తుందని’అని వివరించారు.
దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించామన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేస్తుందా.. అని అవహేళనగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆరు గ్యారంటీలు అసాధ్యమని కొందరు అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందా అని మాట్లాడుకున్నారు.. తెలంగాణలో గెలిచి చూపించామని గుర్తు చేశారు.