మహబూబ్ నగర్ (Mahbub Nagar) ఎమ్మెల్యే (MLA) శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ఎన్నికపై వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి 2018 ఎన్నికల సమయంలో మంత్రి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపిస్తూ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది.
కాగా ఈ కేసులో హైకోర్టు.. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి, అప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్న 16 మంది రిటర్నింగ్ అధికారుల నుంచి వివరణలు, సాక్ష్యాధారాలను సేకరించి హైకోర్టుకు నాలుగు రోజుల క్రితం సమర్పించింది. అయితే గత విచారణ సందర్భంగా అక్టోబర్ 9న తుది తీర్పును వెలువరించనున్నట్టు జస్టిస్ ఎం. లక్ష్మణ్ నేతృత్వంలో సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది.
ఆ ప్రకారమే సోమవారం ఈ పిటిషన్‌పై తీర్పు రావలసి ఉంది. కానీ ఒక రోజు వాయిదా వేసిన బెంచ్.. మంగళవారం ఆర్డర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇక పోలింగ్ అధికారుల సహకారంతో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని రాఘవేంద్ర రాజు అప్పట్లో దాఖలు చేసిన, ఎలక్షన్ పిటిషన్‌పై విచారణ, దాదాపు నాలుగున్నరేళ్లుగా కొనసాగుతొన్న సంగతి తెలిసిందే. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఈ వివాదం ముగిస్తే బాగుండునని అనుకొంటున్నారట శ్రీనివాస్ గౌడ్ అనుచరులు..