– క్రీడాశాఖలో వరుస వివాదాలు
– మొన్న స్పోర్ట్స్ స్కూల్ లో..
– ఇప్పుడు మంత్రి పేషీలో..
– మీడియా ముందుకొచ్చిన బాధిత క్రీడాకారిణి
ఓవైపు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ వ్యవహారంపై కమిటీ విచారణ జరుపుతోంది. నిజానాలేంటో బయటకు తీసుకొచ్చే పనిలో ఉంది. బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారా? లేదా? అనేది పలు కోణాల్లో విచారణ జరిపి రిపోర్ట్ తయారు చేస్తోంది కమిటీ. ఈ వివాదంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రి పేషీలో పని చేసే ఉద్యోగి సురేంద్ర ఓ క్రీడాకారిణిని వేధించిన విషయం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటిన ఆ క్రీడాకారిణి తాజాగా మీడియా ముందుకొచ్చింది. మహిళా క్రీడాకారులకు భద్రత లేకుండా పోయిందని, చాలా మంది రకరకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది కోచ్ లు కామాంధులుగా మారారని ఆరోపించింది. కొందరు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారని తాను మాత్రం ధైర్యంగా ఫైట్ చేశానని చెప్పుకొచ్చింది.
మహిళా క్రీడాకారులపై జరుగుతున్న వేధింపులపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరింది. సురేంద్ర వేధింపుల వ్యవహారం మినిస్టర్ కు తెలియకుండా ఉంటుందని అనుకోవడం లేదని తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు సాధించినా కూడా.. మంత్రి పేషీ నుంచే వేధింపులు వస్తాయని ఊహించలేదని చెప్పింది. చాలాసార్లు క్రీడా శాఖ మంత్రిని కలిసేందుకు ప్రయత్నించానని మెడల్ వచ్చిన ప్రతిసారి శాలువా కప్పి పంపిస్తారని మాట్లాడేందుకు అవకాశమే ఉండదని ఆవేదన వ్యక్తం చేసింది.
తనను వేధిస్తున్న సురేంద్రకు గట్టిగా వార్నింగ్ ఇచ్చానని.. తన బాబాయ్ తో మాట్లాడి క్షమాపణలు కోరడంతో అతడిని క్షమించానని తెలిపింది. తర్వాత, తనను వేధించడం మానుకున్న సురేంద్ర ఇతర క్రీడాకారిణిలను వేధిస్తున్నాడని తెలిసి ఈ విషయాన్ని బయటకు చెబుతున్నానని చెప్పింది బాధిత క్రీడాకారిణి.