ఈమధ్య మహబూబ్ నగర్ కు చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఆ సందర్భంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. హైదరాబాద్ (Hyderabad) రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తూ.. బీసీ మంత్రులను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
ముగ్గురు బీసీ మంత్రులపై రేవంత్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీలను కించపరిస్తే సహించేది లేదని.. రాజకీయంగా అణగదొక్కుతామని వార్నింగ్ ఇచ్చారు. బీసీ మంత్రులపై కోవర్టు ఆపరేషన్ చేస్తున్నారని అన్నారు. గతంలో సర్వాయి పాపన్న వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించాలి అంటే అడ్డుకున్నారని.. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.
రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఇవి జరిగాయి. ఈ వేడుకలకు మంత్రితోపాటు శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, పలువురు ఛైర్మన్ లు, నేతలు హాజరయ్యారు.
రేవంత్ ఏమన్నారంటే..!
కాంగ్రెస్ శ్రేణులను వేధించే పోలీసుల పేర్లు డైరీలో రాసిపెట్టుకుంటున్నాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారు. మహబూబ్ నగర్ పోలీసులను హెచ్చరిస్తున్నా.. రెడ్ డైరీలో మీ పేర్ల రాసిపెడతాం. అసలు, వడ్డీ కలిసి తిరిగి చెల్లిస్తాం. మీ లాంటి వాళ్లను నడిబజార్లో బట్టలూడదీసి నడిపించిన చరిత్ర తెలంగాణకు ఉంది. భూకబ్జాలకు పాల్పడుతున్న శ్రీనివాస్ గౌడ్ చివరకు వక్ఫ్ భూములను సైతం వదలడం లేదు.