రైతు బంధు (Rythu Bandhu)పై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) శుభవార్త (Good News) చెప్పారు. రైతు బంధుపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతు బంధు అందుతుందని హామీ ఇచ్చారు. నిజమైన అర్హులకు పథకాలు అందిస్తే తమ ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆనాటి సీఎం కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారని మండిపడ్డారు. కానీ ఇప్పటి సీఎం రేవంత్ ద్వారా పథకాలు ప్రజల వద్దకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు.
ఎంత అహంకారం ఉన్నా ప్రజల ముందు దిగదుడుపేనని తెలంగాణ ప్రజలు నిరూపించారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులం కలిసి ఈ జిల్లా కోసం పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ జలాలు వచ్చేలా చూస్తామమని హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే ఖమ్మం జిల్లాలోకి నీరు ప్రవేశిస్తాయని స్పష్టం చేశారు.
టన్నెల్ పూర్తి కాగానే పాలేరుకు నీళ్లు వస్తాయన్నారు. పాలేరుకు నీళ్లు వచ్చేలా పొంగులేటితో కలసి తాము ప్రయత్నిస్తామని వెల్లడించారు. పాలేరు, ఖమ్మం తమ దృష్టిలో ఒక్కటేనన్నారు. పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందిచడం కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. తన జీవిత కాలంలో చివరి కోరిక ఇదేనన్నారు. నిన్న ప్రాజెక్ట్ కు సంబంధించిన నీళ్ల కోసం నిధులు కేటాయించామన్నారు.