Telugu News » Ayodhya : అది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవెంట్… రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేం….!

Ayodhya : అది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవెంట్… రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేం….!

అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ముందస్తుగా ప్రారంభిస్తున్నట్టు స్పష్టమవుతోందని వెల్లడించింది.

by Ramu
Clearly an RSS BJP event Congress says wont attend Ram Mandir inauguration

జనవరి 22న జరిగే రామ మందిర (Ram Mandhir) ప్రారంభోత్సవానికి తాము హాజరుకాబోవడం లేదని కాంగ్రెస్ (Congress) ప్రకటించింది. అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే ముందస్తుగా ప్రారంభిస్తున్నట్టు స్పష్టమవుతోందని వెల్లడించింది. అందువల్ల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానాన్ని గౌరవంగా తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.

Clearly an RSS BJP event Congress says wont attend Ram Mandir inauguration

ఈ కార్యక్రమాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. 2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరామున్ని గౌరవించే లక్షలాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈవెంట్ ఆహ్వానాన్ని తిరస్కరించారని ప్రకటనలో పేర్కొంది.

‘ఈ దేశంలో లక్షలాది మంది భక్తులు భగవాన్ శ్రీ రామున్ని పూజిస్తారు. మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ అయోధ్య రామాలయాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ ప్రాజెక్టుగా మార్చి వేశాయి. అసంపూర్తిగా ఉన్న ఈ ఆలయాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు ప్రారంభించడం కేవలం ఎన్నికల లబ్ధి కోసం ఈ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు స్పష్టమవుతోంది’అని చెప్పింది.

కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. త్రేతా యుగంలో రావణుడి లాగానే కాంగ్రెస్ కూడా మతి పోయిందని మండిపడింది. కాంగ్రెస్ నిర్ణయంపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫైర్ అయ్యారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై తర్వాత ఆ పార్టీ పశ్చాతాప పడుతుందన్నారు.

కాంగ్రెస్ ‘రామ వ్యతిరేక వైఖరి’ దేశ ప్రజలందరికీ తెలిసిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. రాముడు కల్పిత పాత్ర అని సోనియా గాంధీ నేతృత్వంలో న్యాయస్థానంలో కాంగ్రెస్ అఫిడవిట్ వేసిందన్నారు. ఆ పార్టీ ఇప్పుడు రామాలయం ప్రాణ ప్రతిష్ఠ ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆశ్చర్యకరం ఏమీ కాదని ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి మరోసారి సనాతన ధర్మాన్ని అవమానించిందన్నారు.

రాముడిని ఊహాజనిత పాత్ర అని పిలిచే వారి నుంచి ఇలాంటి నిర్ణయం కొత్తేమీ కాదన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ హామీ ఇచ్చిందని విరుచుకు పడ్డారు. 2024లో రాముడిని బహిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు బహిష్కరిస్తారన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రామ మందిర ప్రారంభోత్సవానికి రావడం లేదని ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసిందని బీజేపీ నేత నళిన్ కోహ్లీ అన్నారు.

రాముడి ఉనికిని తిరస్కరించిన కాంగ్రెస్ నిర్ణయంలో తమకు ఎలాంటి ఆశ్చర్యం కలగలేదని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. త్రేతా యుగం నాటి రామరాజ్యం నేడు ప్రధాని మోడీ పాలనలో భారత్ కు తిరిగి వచ్చిందన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకాని వారు జీవితాంతం పశ్చాతాపపడుతురన్నారు.

రాముడి ఆశీస్సులు బీజేపీకి అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్‌ వాళ్లు పూర్తిగా పిచ్చివాళ్లయ్యారని కర్ణాటక మాజీ సీఎం సదానంద గౌడ అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు ఆదరిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌కు 50 సీట్లకు మించి రావని సదానంద గౌడ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment