యూపీ (UP) సర్కార్ నిర్ణయం నేపథ్యంలో ‘హలాల్’సర్టిఫికెట్ల (Halal Certificates)పై నిషేధానికి పలు రాష్ట్రాల్లో విజ్ఞప్తులు వస్తున్నాయి. తాజాగా బిహార్‌లోనూ హలాల్ ధ్రువీకృత ఉత్పత్తులపై నిషేధం విధించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు కేంద్ర మంత్రి లేఖ రాశారు. హలాల్ ధ్రువీకరణకు సామాజిక వివక్షత, తీవ్రవాద కార్యకలాపాలకు మధ్య సంబంధం ఉందని అందోళన వ్యక్తం చేశారు.
ఇస్లామిక్ ప్రమాణాలతో సంబంధం లేని అటువంటి ధృవీకరణను మతంతో సంబంధం లేని ఉత్పత్తులను ఇస్లామీకరించే ప్రయత్నంగా అభివర్ణించారు. హలాల్ సర్టిఫికేట్‌లను జారీ చేయడంలో సంస్థలు స్వయం ప్రకటిత అధికారులుగా మారాయని ఆరోపించారు. పైగా తయారీ కంపెనీల నుంచి సదరు సంస్థలు గణనీయంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని అన్నారు.
హలాల్ సర్టిఫికేషన్, వ్యాపారం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఇటీవల యూపీలో హలాల్ ధ్రువీకరణ ఉత్పత్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్బంగా తెలిపారు. అలాంటి చర్యలను బిహార్‌లోనూ అమలు చేయాలని కోరారు. హలాల్ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న జిహాద్‌పై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.
విభజన, కుట్రపూరితమైన అంశాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల యూపీలో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులపై యూపీ సర్కార్ నిషేధం విధించింది. హలాల్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలను నిషేధిస్తున్నట్టు యూపీ సర్కార్ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది.