– ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా ప్రజా పాలన
– అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయి
– ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజా పాలన
– ఏ ఒక్క దరఖాస్తు తిరస్కరించవద్దు
– అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజా పాలన కింద జనవరి 6 వరకు అభయ హస్తం పేరిట దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దీనిపై అధికారులకు అవగాహనా కార్యక్రమాన్ని కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించారు. దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకుపోయి, ఒక చరిత్రాత్మక ఆదేశాలను ఇచ్చామన్నారు. ఈ గ్యారెంటీలన్నింటినీ వంద రోజుల వ్యవధిలో అమలు చేయబోతున్నామని వివరించారు.
ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండాలని, అవినీతికి తావు లేకుండా పథకాల అమలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. అధికారులు ఎవరి స్థాయిలో వారు చొరవ తీసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేలా పని చేయాలని సూచించారు. ఇటీవల తాను పలు రేషన్ షాపులను తనిఖీ చేశానన్నారు ఉత్తమ్.
బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రేషన్ బియ్యాన్ని ఎవరైనా రీసైక్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారిస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఈ నెల 29న వెళ్తున్నట్లు చెప్పారు.