అప్పులు చేసి ప్రాజెక్టులు నిర్మించినా అందుకు తగిన ఫలితం రాలేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy) అన్నారు. అవసరం మేరకు వ్యయం చేసి ఆయకట్టును నిర్మించాలని తెలిపారు. కొత్త ఆయకట్టు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఐదేండ్లలో ఏ ప్రాజెక్టుల కింద కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామనే సమాచారాన్ని రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం (Kaleshwaram) తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందన్నారు.
సాగు నీటి ప్రాజెక్టులు, నీటి విడుదల అంశాలపై అధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. నీటి పారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని పేర్కొన్నారు. కానీ అందుకు తగిన ఫలితం రాలేదని మండిపడ్డారు. ఇపుడు అవసరమైన నిధులను వెచ్చించి కొత్త ఆయకట్టు సృష్టించాలని తెలిపారు.
కొత్త ప్రాజెక్టుల్లో నీరందించే విషయంలో అడ్డంకులన్నింటినీ అధిగమించాలని, సకాలంలో నీరందించాలని సూచించారు. ఏడాది చివరి నాటికి కొత్తగా నాలుగున్నర నుంచి ఐదు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించేలా చూడాలన్నారు. ఈ మేరకు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. పలు ప్యాకేజీల కింద కృష్ణా, గోదావరి బేసిన్లలో సుమారు 18 ప్రాజెక్టుల్లో ఈ ఏడాది చివర నాటికి నీరందిస్తామని స్పష్టం చేశారు.
ఐడీసీ పరిధిలో ఉన్న అన్ని చిన్న ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త ఆయకట్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాళేశ్వరం అందుబాటులో లేకపోవడంతో ఎస్సారెస్పీ స్టేజ్ 2 నీళ్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి మంథని నియోజకవర్గానికి నీరందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఆలోచన మేరకు కోయినా ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని మనకు ఇవ్వాలని కోరతామన్నారు. రాబోయే వేసవిలో రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలను చేపట్టలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టి వర్షాకాలంలోపు చెరువులన్నింటిని పూర్తి చేయాలన్నారు.