అవినీతి, అక్రమాలు తావులేకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తెలిపారు. ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల(six guarantee Schemes)కు కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రామస్వామి గట్టు వద్ద ఇందిరమ్మ మోడల్ కాలనీని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. లబ్ధిదారులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ సర్కార్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో కేవలం 240 ఇండ్లను మాత్రమే మంజూరు చేసిందని మండిపడ్డారు. అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని ఆరోపించారు. త్వరలోనే గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా అధికారులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.