ఎల్ అండ్ టీ (L&T) సంస్థ ప్రతినిధులపై నీటి పారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ను అంత నాణ్యత లేకుండా ఎలా చేస్తారంటూ ఫైర్ అయ్యారు. అధికారికి ఏదో ఒక లెటర్ ఇచ్చి తప్పించుకుంటామంటే కుదరదని తేల్చిచెప్పారు.
సచివాలయంలో ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ భేటీ సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పునరుద్ధరణ పనులకు సంబంధించి వివరాలపై మంత్రి ఆరా తీశారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఏ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని తీవ్రంగా హెచ్చరించారు.
తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయపరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవన్నారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి వారితో కూడా మాట్లాడుతామన్నారు. మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
నిర్మాణ సంస్థతో ఉన్న ఒప్పందం, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనుల పూర్తికి చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులను వివరాలు అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థే పునరుద్ధరిస్తుందని ఈ ఎన్సీ అధికారులు వివరించారు. ఇది ఇలా వుంటే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
శాసన సభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యారేజీకి సంబంధించి నీటిపారుదలశాఖకు నిర్మాణ సంస్థ రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజినీర్లు సీఎంకు వివరించారు.