– అసెంబ్లీలో శ్వేతపత్రం రగడ
– కాంగ్రెస్ పై హరీష్ రావు ఆగ్రహం
– వరుసబెట్టి కాంగ్రెస్ మంత్రుల ఎటాక్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అసెంబ్లీలో మాట్లాడారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని విమర్శించారు. అలాగే, మోటార్లకు మీటర్ల విషయంపైనా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మంత్రులు వరుసగా ఎటాక్ మొదలుపెట్టారు.
శ్వేత పత్రం లెక్కల్లో తప్పు ఉంటే చెప్పండని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. ఎవరెవరో పేర్లు చెప్పి తప్పుదారి పట్టించొద్దని చెప్పారు. దీంతో హరీష్ రావు మాట్లాడుతూ.. అంతా వాళ్లకు కన్వినెంట్ గా తయారు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కొలిచే విధానం ఫాలో కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారని అన్నారు. హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం పూర్తిగా తెలుసుకున్న తర్వాత సభలో మాట్లాడాలని సూచించారు. సత్యదూరమైన మాటలు చెప్పి సభను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించారు. లెక్కల్లో తప్పొప్పులు ఉంటే తమ ఆర్థిక మంత్రి చెబుతారని పేర్కొన్నారు. నివేదిక ఎవరో తయారు చేశారనే మాటలు సరికాదని హితవు పలికారు. హరీష్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశంలోని కేంద్ర ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారాల్లో కట్టల రూపంలో ప్రభుత్వం దగ్గర నిలువ ఉండవని హరీష్ రావు వ్యాఖ్యానించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందించారు. అర్బాటానికి, అట్టహసానికి రాష్ట్రంలో ఇబ్బంది లేదు కానీ.. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ట్రానికి తీసుకొచ్చారని కౌంటర్ ఇచ్చారు.
హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పిందన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు కట్టమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బదులిచ్చారు. ఆ సమయంలో తాను ఎంపీగా పార్లమెంట్ లో ఉన్నానని, ఆ బిల్లులో ఎక్కడా కూడా రైతులు బోరు బావుల వద్ద మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని లేదని కౌంటర్ ఇచ్చారు.
ఇటు, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో మంత్రి కొండా సురేఖ హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా హరీష్ వ్యాఖ్యలపై కొండా సురేఖ (Konda Surekha) ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారన్నారు. డబుల్ బెడ్రూం నిరు పేదలకు ఇవ్వలేదన్నారు. వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారని విమర్శలు చేశారు. జగన్, కేసీఆర్ బయట తిట్టుకుంటారని.. లోపల మాత్రం కలిసే ఉంటారన్నారు. కష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కేంద్రాన్ని దూరం పెట్టిందే కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. వరంగల్ జైలు కూలగొట్టి ఏం చేశారని అడిగారు. పాత సెక్రటేరియట్ కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. అంతకు ముందు, హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించలేదన్నారు.