మిస్ యూనివర్స్-2023 (Miss Universe- 2023) పోటీలకు ప్రపంచ నలు దిక్కుల నుంచి ఎంతో మంది అందగత్తెలు పోటీపడుతుంటారు. దాని కోసం ఏళ్ల తరబడి ప్రత్యేకంగా ట్రేనింగ్ తీసుకుంటారు. నిష్ణతుల నుంచి కూడా సలహాలు తీసుకుంటారు. 2023కి గానూ ఈ ప్రతిష్టాత్మక పోటీలకు సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్ (El Salvador) వేదికైంది.
72వ మిస్ యూనివర్స్ 2023 పోటీలు సాల్వడార్‌లో అట్టహాసంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న ‘మిస్ యూనివర్స్’ కిరీటం ఈ ఏడాది నికరాగ్వా దేశానికి చెందిన అందాల భామ సొంతం చేసుకుంది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ‘మిస్ యూనివర్స్ -2023’ టైటిల్ దక్కించుకుంది. ఎన్నాళ్ల నుంచో ఆమె కన్నకల నిజమైంది.
దేశ విదేశాల నుంచి ఏంతో మంది సుందరీమణులు పాల్గొనే ఈ అందాల పోటీల్లో గెలుపొందాలంటే అందం మాత్రమే సరిపోదు. అందుకు తగిన తెలివితేటలనూ ప్రదర్శించాల్సి ఉంటుంది. అందులో షెన్నిస్ తన ప్రత్యేకతను చాటింది. మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచి తనకంటూ ఓ పేజీని లిఖించుకుంది.
ఈ సందర్భంగా మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని ఆమెకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోటీల్లో దాదాపు 84దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. భారత్ తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.