ప్రతీ సంవత్సరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘మిస్ వరల్డ్’(Miss World) పోటీలకు ఈ ఏడాది భారత్(Bharath) ఆతిథ్యమిస్తోంది. ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పోటీలకు 28ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ అవకాశం దక్కింది. గతంలో 1996లో తొలిసారి భారత్‌లో పోటీలు జరిగాయి.
ఆ తర్వాత సొంతగడ్డపై ఎప్పుడూ ఆ అవకాశం దక్కలేదు. 1996లో గ్రీస్ బ్యూటీ ఇరెనె కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈసారి ఢిల్లీలోని ఆశోక హోటల్లో ఫిబ్రవరి 20న ప్రారంభ వేడుకతో మొదలుకొని పలు పోటీలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. మార్చి 9న ఫైనల్ జరగనుంది.
ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు కనువిందు చేయనున్నారు. భారత్ తరఫున కర్ణాటకకు చెందిన సిని శెట్టి ‘మిస్ వరల్డ్’ కిరీటం కోసం పోటీ పడుతోంది. గత విజేత కరోలినా (పోలండ్) ఈసారి ప్రపంచ సుందరికి తన స్వహస్తాలతో కిరీటం అలంకరించేందుకు సిద్ధమైంది.
ఈసారి జరుగుతోన్న 71వ ‘ప్రపంచ సుందరి’ పోటీలకు భారత్ ఆతిథ్యమివ్వడానికి తోడు మన దేశం తరఫున సిని శెట్టి ఈ పోటీల్లో పాల్గొంటుండడం వల్ల అందరి దృష్టీ ఆమె పైనే ఉందని చెప్పాలి. ఇలా ఈసారి తానో పోటీదారుగానే కాకుండా భారత్ అందిస్తున్న ఆతిథ్యంలో తానూ భాగమవడం తన జర్నీని మరింత ప్రత్యేకంగా మలిచిందని వెల్లడించింది.