బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) కు చేదు అనుభవం ఎదురైంది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే (MLA) ను దళితులు అడ్డుకున్నారు. బీబీపేట్ (BibiPet) గ్రామ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయన కారును దళితులు అడ్డుకున్నారు.
గ్రామంలోకి ఎమ్మెల్యే కారు రాకుండా అడ్డుకుని నిరసనకు దిగారు. ఇన్ని రోజుల పాటు ఎమ్మెల్యే తమ గ్రామానికి రాలేదని గ్రామస్తులు అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మళ్లీ తమ గ్రామానికి వస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు తమ గ్రామం గుర్తుకు వచ్చిందా అంటూ ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేయని వారు ఇప్పుడు ఓట్లు ఎందుకు అడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామంలో అర్హులైన దళితులకు దళితబంధు ఇవ్వడం లేదని అన్నారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులందరికీ రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.