మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (CM Eknath Shinde) తనను క్రిమినల్‌గా మార్చాడని బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ (MLA Ganpat Gaikwad) షాకింగ్ కామెంట్స్ చేశారు. భూ వివాదంలో పోలీస్ స్టేషన్‌లోనే షిండే వర్గం శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై (Mahesh Gaikwad) ఎమ్మెల్యే గణ్‌పత్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
అయితే తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన ఓ మీడియా సంస్థతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసు స్టేషన్‌లో తన కొడుకును కొట్టారని, తన భూమిని బలవంతంగా లాక్కున్నారని వాపోయారు.
ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగితే ఇలాంటి నేరగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. షిండే తనలాంటి మంచి వ్యక్తిని ఇవాళ క్రిమినల్‌గా చేశాడంటూ ఆరోపించారు. తాను నిరాశతోనే కాల్పులు జరిపానని, అందుకు తనకేమీ పశ్చాత్తాప పడటంలేదని తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లో కొందరు కళ్లముందే తన కుమారున్ని కొట్టారని, ఇలా కాకుండా నేనేం చేయగలనని ప్రశ్నించారు. వారిని చంపాలనేది తన ఉద్ధేశం కాదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, మహేశ్ గైక్వాడ్‌పై ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ పది రౌడ్ల బుల్లెట్లు అక్కడ లభించాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు.