కాంగ్రెస్ (Congress) పై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, అద్భుతమైన సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని ప్రజల్లో భ్రమలు కల్పించారని అన్నారు. కేవలం అధికారంలోకి రావడానికే కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చిందని ఫైర్ అయ్యారు. కానీ నెల రోజుల్లోనే ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైందని మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు కడియం శ్రీహరి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకు రాకపోగా, గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తోందని నిప్పులు చెరిగారు. గ్యారంటీల్లో కేవలం ఒక్క అంశాన్ని అమలు చేసి మొత్తం అమలు చేశామంటే ఎలాగంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో దళిత బంధును ఆపివేయాలంటూ కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రైతు బంధు విషయంలోనూ జాప్యం జరుగుతోందని చెప్పారు. గృహలక్ష్మీ కింద అర్హతలను కలెక్టర్లు గుర్తించి లబ్ధిదారులను ఖరారు చేశారని వెల్లడించారు. కొంత మంది ఇప్పటికే ఇండ్ల పనులు కూడా ప్రారంభించారని పేర్కొన్నారు. ఇప్పుడు గృహలక్ష్మీని కాంగ్రెస్ రద్దు చేయడంతో పేదలు రోడ్డున పడ్డారని అన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వం విచారణ జరిపించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.500 బోనస్‌తో వడ్లు కొంటామని హామీ ఇచ్చారని, కానీ దాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. విపరీత హామీలతో ప్రజలను మోసం చేసినట్లు కనిపిస్తోందని ఆరోపణలు గుప్పించారు. హామీలు అమలు అమలు చేయడం చేతగాకనే కాలయాపన చేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ రైతు బంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఆదాయ వనరులపై అవగాహన లేకుండా ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై తొలి సంతకం అన్నారని, కానీ నేటి వరకు అతీగతి లేకుండా పోయిందని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు రోజుకో రకంగా ఉంటున్నాయని ఫైర్ అయ్యారు. అదానీ పీడ విరగడ అయిందని గతంలో నాగపూర్ సభలో రేవంతో రెడ్డి చెప్పారని, కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో అదానీకి రెడ్ కార్పెట్ వేశారన్నారు. ఇప్పటికైనా ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు. హస్తం గుర్తుకు ఓటు వేసినందుకు యువకులకు మొండి చేయి చూపించారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏ పథకంపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు.