సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(Secunderabad Cantonment MLA Lasya Nanditha) నందిత రోడ్డు ప్రమాదంలో మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, ఆమె అంత్యక్రియలను కాంగ్రెస్ సర్కార్ అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచనల మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) ఆదేశాలు జారీ చేశారు.
అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లాస్య నందిత మృతి బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా, ప్రమాద సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు వెల్లడించారు. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం కార్ఖానాలోని నివాసానికి ఆమె పార్థివదేహాన్ని తరలించారు.
ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లాస్య నివాసానికి బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. లాస్య నందిత మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
లాస్య తండ్రి జి.సాయన్న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సమయంలో అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు. తాజాగా సాయన్న కూతురు అయిన ఎమ్మెల్యే లాస్య ప్రమాదవశాత్తు చనిపోవడంతో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది.