– ఒకే ఫ్రేమ్ లో రాజయ్య, కడియం
– ప్రగతి భవన్ కు పిలిపించిన కేటీఆర్
– భేటీ అనంతరం స్వరం మార్చిన రాజయ్య
– సమావేశంలో ఏం జరిగింది..?
– రాజయ్యకు కేటీఆర్ ఇచ్చిన హామీ ఏంటి..?
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య (Rajaiah), ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (Kadiyam Srihari) మధ్య ఎలాంటి వైరం ఉందో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. ఇద్దరూ ఉన్నది ఒకే పార్టీలో అయినా.. తరచూ వీళ్ల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంటుంది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో రాజయ్యను కాదని.. శ్రీహరికి టికెట్ అనౌన్స్ చేశారు అధినేత కేసీఆర్. కానీ, బీఫామ్ ఇచ్చేదాకా ఏదైనా జరగొచ్చు అంటూ కొన్నాళ్లుగా నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు రాజయ్య.
కడియం కూడా తగ్గేదే లేదన్నట్టుగా తన పంథాలో డైలాగులు పేలుస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయి క్యాడర్ లో గందరగోళం నెలకొంది. రోజురోజుకీ ఈ వార్ పీక్స్ కు చేరుతుండడంతో అధిష్టానం కలగజేసుకుంది. పరిస్థితి ఇలాగే ఉంటే సీటుకే ఎసరు తప్పదని భావించి ఇద్దరు నేతలను ప్రగతి భవన్ (Pragati Bhavan) కు పిలిచింది. మంత్రి కేటీఆర్ (KTR) తో రాజయ్య, కడియం భేటీ అయ్యారు. అయితే.. ఉప్పు, నిప్పులా ఉన్న వీళ్లిద్దరూ సమావేశం తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ మాదిరి ఫోటోలకు ఫోజులిచ్చారు.
రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో ఫుల్ హ్యాపీగా ఫీలయిన ఎమ్మెల్యే… వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. ఇటు తనకు రాజయ్య మద్దతు ప్రకటించడం పట్ల కడియం ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి కేటీఆర్ చొరవతో చాలాకాలంగా ఒకరిపై ఒకరు పోరు సాగిస్తున్న నేతలు ఒక్కటవడంతో క్యాడర్ హ్యాపీగా కనిపిస్తోంది.
ఈ భేటీతో స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ లో విభేదాలు సమసిపోయాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సమావేశం అనంతరం కడియం, రాజయ్య ఆలింగనం చేసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి స్టేషన్ ఘన్ పూర్ లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ వీరిద్దరికీ సూచించారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.