తెలంగాణ రాష్ట్రంలో అధికార.. ప్రతిపక్షాల మధ్య సాగుతోన్న మాటల యుద్దం కొందరికి ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తుందని అనుకొంటున్నారు.. మొదట సక్సెస్ అయిన సినిమా రెండో పార్టు ప్రకటించగానే ఆసక్తిగా చూసే వారు.. బీఆర్ఎస్ సినిమాని రెండు సార్లు ఓపికగా చూశారు.. అట్టర్ ఫ్లాప్ సినిమాని ఇన్ని రోజులు ఆడించామా అని భావించిన ఓటర్లు ఇంటికి పంపించి.. కాంగ్రెస్ బొమ్మను తెలంగాణ తెరపై ఆవిష్కరించారని జనం అనుకొంటున్నారు..
అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం అప్పుడే కాంగ్రెస్ కి సక్సెస్ టాక్ రావాలని ఆరాటపడుతోన్నట్టు చేస్తున్న విమర్శలు జనంలో నవ్వులపాలవుతోన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయినా ఐ డోంట్ కేర్ అంటూ విమర్శల దాడులు బీఆర్ఎస్ నేతలు ఆపడం లేదని అనుకొంటున్నారు.. ఇదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar).. కాంగ్రెస్ హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు..
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలంలో జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ తో కలిసి శనివారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న సంజయ్ కుమార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నుంచి ప్రభుత్వం తప్పుకుంటుందని విమర్శించారు.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం యువ వికాసం పథకాన్ని ప్రజాపాలన (Praja Palana) లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలలో (Six Guarantees) యువతకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. రాష్ట్రంలో దరఖాస్తులు లేకుండా సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని సంజయ్ కుమార్ సూచించారు.