తెలంగాణ (Telangana)లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అందులో రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) జోరు పెరుగుతున్న క్రమంలో.. హస్తం అధికారంలోకి వస్తుందనే ధీమా పార్టీ వర్గాలలో మొదలైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు? అనే పంచాయితీ తెరపైకి వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మొదలవుతున్న కుర్చీలాట మ్యూజికల్ చైర్‌ను తలపిస్తున్నది.
ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం.. అన్న చందంగా పార్టీలో అప్పుడే ముఖ్యమంత్రి నేనే అనే ఏకవచన రాగం వినిపిస్తుందని జనం అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సీఎం (CM) పదవిపై తాజాగా ములుగు (Mulugu) ఎమ్మెల్యే సీతక్క (MLA Seetakka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కి మెజారిటీ వస్తే ఎస్సీ, ఎస్టీ, లేదా ఒక మహిళ, ఓసీ అభ్యర్థి కానీ సీఎం అవుతారని పేర్కొన్నారు. ఒకవేళ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తాను సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
తన బలం, బలహీనత బడుగు, బలహీన వర్గాల ప్రజలన్న సీతక్క.. తాను చేస్తున్న సేవ ప్రజలకు తెలుసని అన్నారు. తనను ఓడించేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నుతున్నాయని.. చివరికి రూ.200 కోట్లు ఖర్చు చేసిన తనను ఓడించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 వేల ఓట్ల మెజార్టీతో.. 8 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉన్నదని తెలిపారు. ప్రజలు బీఆర్‌ఎస్ అహంకార చర్యలతో విసిగిపోయారన్న సీతక్క కాంగ్రెస్ వైపు చూపు సారించారని అన్నారు. ఆశ చూపించి దోపిడి చేస్తున్న బీఆర్‌ఎస్ కంటే.. ప్రజల కష్టాలు అర్థం చేసుకునే కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ప్రజలు అందరూ ఏకం అవ్వాలని పార్టీని గెలిపించాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు..