కాంగ్రెస్ (Congress) పై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 60 ఏండ్ల పాటు అధికారంలో ఉండి కూడా బీసీల కోసం ఓ ప్రత్యేకమైన శాఖను కాంగ్రెస్ ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేక పోయిందన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు హఠాత్తుగా కులగణన చేయాలని డిమాండ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. రాహుల్ గాంధీ భ్రమలో బతుకుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పుడూ అధికారంలోకి రాదన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ భ్రమల్లో నుంచి బయకు వచ్చి కులగణన గురించి మాట్లాడటం మానేస్తారని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రజల కోసం పని చేసి ఉంటే ఆ పార్టీని ప్రజలే ఆశీర్వదించి అధికారం కట్టబెట్టేవారని అన్నారు.
గడిచిన పదేండ్లుగా కుల గణన, బీసీ శాఖ కోసం బీఆర్ఎస్ సర్కార్ పోరాటం చేస్తోందని వివరించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతోందన్నారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. నిన్ననే ఎన్నికల నగారా మోగిందన్నారు. మొట్ట మొదటి సమావేశం గౌడ కుల బాంధవులతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కంఠేశ్వర్‌లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….. గౌడ కులస్తుల కల్లు వ్యాపారాన్ని గత ప్రభుత్వాలు చిన్న చూపు చూశాయన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక గౌడ కులస్తులకు అండగా ఉంటామని కేసీఆర్ ఉద్యమ సమయంలోనే చెప్పారన్నారు. అలాంటి కుల వృత్తులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో నిజామాబాద్ నుంచి ఎంతో మంది పెద్ద నేతలు పని చేశారని అన్నారు. కానీ జిల్లాకు కేవలం ఒకటే బీసీ హాస్టల్ వుండేదన్నారు. కానీ ఇప్పుడు జిల్లాకు 15 బీసీ హాస్టల్స్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నామని వివరించారు. తెలంగాణలో ఉన్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం అన్నారు.