ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా(Jagtial dist) కోర్టులో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మి వేసిన వారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారా? అని అన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా? అరాచకం వైపు ఉందామా..? అంటూ ప్రజలను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛను రూ.1000కు పెంచారు. కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ, ఇచ్చిన హామీ మేరకు పింఛన్ ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే రూ.3వేలు పింఛన్ ఇస్తామని కవిత వివరించారు. బీడీ కార్మికులకు రూ.3వేలు పింఛన్ ఇస్తామని చెప్పారు.
ప్రస్తుతం రైతులకు ఇస్తున్నట్లుగానే రేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి బీమా పథకం వర్తిస్తుందన్నారు. ఏ కారణం చేతనైనా కుటుంబ పెద్ద మృతిచెందితే ఆ కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మరోసారి చెప్పారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమిత్ షా కాదు అబద్దాల బాద్ షా అని విమర్శించారు. పది సంవత్సరాల నుంచి సిలిండర్ ధర విషయంలో మోడీ, కేసీఆర్‌కు గొడవ జరుగుతోందని తెలిపారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని మూయించిందే బీజేపీ ఆంధ్ర ప్రాంత ఎంపీ అని గుర్తుచేశారు. ఢిల్లీ నాయకులతో నేడు మోడీ వస్తున్నాడని ఎద్దేవా చేశారు. మీలా నలుగురి కుటుంబం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ కుటుంబం మాదని కవిత అన్నారు.